ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం రవ్వబొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే రవ్వబొబ్బట్లు మీ సొంతం.
రవ్వబొబ్బట్లు కి కావలసిన పదార్ధాలు:
బొంబాయి రవ్వ - 1కప్పు
పంచదార - 1కప్పు
నీళ్ళు - 3 కప్పులు
మైదా - 1కప్పు
గోధుమ పిండి -1/4 కప్పు
నెయ్యి - సరిపడ
వంట సోడా - కొద్దిగ
యాలకులపొడి - 1/4 స్పూన్
రవ్వబొబ్బట్లు తయారు చేసే విధానం:
ముందుగా మైదా, గోధుమ పిండిని జల్లించి పక్కన పెట్టుకోవాలి. తరువాత దానిలో తగినన్ని నీళ్ళు పోసి పూరీ పిండిలా కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి కొద్దిగ నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళుపోసి మరగనివ్వాలి. నీళ్ళు మరిగిన తర్వాత పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలబెట్టాలి.
తర్వాత బొంబాయిరవ్వ ఉండలు కట్టకుండా కలుపుతూ చిక్కబడే దాకా ఉంచుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న మైదా పిండిని చిన్న సైజు పూరీలుగా వత్తుకోవాలి. పూరీల మధ్యలో రవ్వ పూర్ణాన్ని పెట్టి చుట్టూ పూరీతో మూసేసి దాన్ని కర్రతో లేదా చేత్తో బొబ్బట్టులా ఒత్తి పెనం మీద కొద్ది కొద్దిగ నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలాగే అన్నీ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి రవ్వ బొబ్బట్లు మీముందు సిద్దం.