ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం మునక్కాయ పప్పు చారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే మునక్కాయ పప్పు చారు మీ సొంతం.
మునక్కాయ పప్పు చారు కి కావలసిన పదార్ధాలు:
మునక్కాయలు -2
కందిపప్పు - 1 కప్పు
టమాటో - 1
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 4
నూనె - 4 స్పూన్స్
పోపు గింజలు - 2 స్పూన్స్
సాంబార్ పొడి - 1 స్పూన్
చింతపండు - కొద్దిగా
పసుపు - 1/2 స్పూన్
కారం - 1 స్పూన్
ఉప్పు - సరిపడ
మునక్కాయ పప్పు చారు తయారు చేసే విధానం:
ముందుగా పప్పను కడిగి విడిగా మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత మునక్కాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమోటోలను ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో నీళ్ళు, కొద్దిగా ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. కొద్దిగా ఉడికిన తరువాత చింతపండు రసం పోసి మరి కొద్ది సేపు ఉడికించాలి.బాగా ఉడికిన తరువాత దించి పక్కనపెట్టుకోవాలి.
ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాగాక పోపు గింజలు, మరో ఉల్లిపాయ, టొమోటో ముక్కలు, కారం, పసుపు వేసి వేగాక ఈ పోపుని ముందుగ ఉడికించిన పులుసులో వేసి మరి కొద్దిగా నీళ్ళు పోసి పప్పు మిశ్రమాన్ని కూడా వేసి కలిపి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. బాగా మరుగుతున్నప్పుడు అందులో సాంబార్ పొడి, కొత్తిమీర వేసి దింపుకోవాలి. అంతే వేడి వేడి మునక్కాయ పప్పుచారు సిద్ధం.