ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే పన్నీర్ ఫ్రైడ్ రైస్ మీ సొంతం.
పన్నీర్ ఫ్రైడ్ రైస్ కి కావలసిన పదార్ధాలు:
బాస్మతి బియ్యం - రెండు కప్పులు
పన్నీర్ ముక్కలు - 2 కప్పులు
క్యాప్సికమ్ - 1
పచ్చిబఠాణి - 1/2 కప్పు
కొబ్బరి తురుము - 1/2 కప్పు
క్యారట్ తురుము - 1/2 కప్పు
ఉల్లికాడల తురుము - 1/2 కప్పు
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
టొమాటోసాస్ - 1 స్పూన్
గరంమసాలా పొడి -1/2 స్పూన్
మిరియాల పొడి - 1/2 స్పూన్
కారం - 1 స్పూన్
ఉప్పు - సరిపడ
జీడిపప్పు - కొద్దిగా
నూనె - 50 గ్రాములు
పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం:
ముందుగా బాస్మతి బియ్యం కడిగి కాస్త పలుకుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలిలో కొద్దిగా నూనె పోసి కాగాక పన్నీర్ ముక్కలను, జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి అది వేడి ఐన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత ఉల్లికాడల తురుము, క్యాప్సికమ్, పచ్చిబఠానీలు, క్యారట్ తురుము వేసి కొంచెం సేపు వేయించాలి.
ఆ తర్వాత టోమాటో సాస్, మిరియాల పొడి, గరం మసాలా పొడి, కారం, తగినంత ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అందులోనే వేయించి పెట్టుకొన్న పన్నీర్ జీడిపప్పు ముక్కలు, వండిన అన్నం వేసి అన్నీ బాగా కలిసేలా కలబెట్టాలి. చివరగా తరిగిన కొత్తిమిర, తురిమిన కొబ్బరి కూడా చల్లి ఐదు నిమిషాలు ఉంచి దింపేయాలి. అంతే నోరూరించే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ.