ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలు లోని ఈ రుచికరమైన వంటకం పనీర్ షాహికుర్మా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే పనీర్ షాహికుర్మా మీ సొంతం.
పనీర్ షాహికుర్మా కి కావలసిన పదార్ధాలు:
పనీర్ - 100 గ్రా
ఉల్లిపాయలు - 3
అల్లం,వెల్లుల్లి పేస్టు- 1 స్పూన్
గరం మసాల - కొద్దిగా
గసగసాలు - 10 గ్రా
ఉప్పు - సరిపడ
పసుపు -చిటికెడు
జీడిపప్పు - కొద్దిగా
పచ్చిమిర్చి- 3
కారం- 1/2 స్పూన్
నూనె- సరిపడ
కొత్తిమీర - సరిపడ
పనీర్ షాహికుర్మా తయారు చేసే విధానం:
ముందుగా పన్నీరు ని రెండు భాగాలు చేసి కొన్ని ఒక సగం ముక్కలుగాను మరో సగం తురిమి ఉంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను కొద్దిగా నీళ్ళలో ఉడికించి చల్లారిన తర్వాత మిక్సి చేసుకోవాలి. తరువాత బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిపాయ ముద్ద వేసి దోరగా వేయించాలి. వేగాక అందులో అల్లం, వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ముక్కలు, కూడా వేసి బాగా వేగనివ్వాలి. తరువాత గసగసాలు, పసుపు కూడా వేసుకొని కొద్దిగా వేగిన తరువాత మొత్తం పన్నీర్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి రెండు నిముషాలు ఉంచాలి.
తరువాత అందులో కొన్ని నీళ్ళు, సరిపడ ఉప్పు, కారం కొద్దిగా గరం మసాల వేసి చిన్న మంటపై 10 నిముషాలు ఉడికించి పైన కొత్తిమీర చల్లి దింపుకోవాలి. సర్వ్ చేసే ముందు జీడిపప్పును కొద్దిగా నేతిలో వేయించి కుర్మలో కలుపుకోవాలి. అంతే రుచికరమైన పనీర్ షాహికుర్మా తయార్.